ఆంధ్రప్రదేశములో సమగ్ర నీటి పథకం

image: 
Author: 
పుచ్చలపల్లి సుందరయ్య
Body: 

      రాష్ట్రంలో జలవనరులు పుష్కలంగానే ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు అనేక ఉపనదులు కూడా ప్రవహిస్తున్నాయి. అయితే ఈ జలవనరులను వివిధ ప్రాంతాల అవసరాలను, ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాపిత దృష్టితో వినియోగించుకోవడంలోనే లోపం జరుగుతున్నది. ఫలితంగా వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అపోహలకు ఆస్కారం కలుగుతున్నది. ఒక ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణంతో, మరొక ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పోటీ పెట్టడం జరుగుతున్నది ప్రాంతాల మధ్య వివాదాలకు, విభేదాలకు, వేర్పాటువాదాలకు ఈ ధోరణులు దారితీస్తున్నాయి.
      సమైక్యాంధ్ర కోసం జరిగిన పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు, 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' రచయిత పుచ్చలపల్లి సుందరయ్య అన్ని ప్రాంతాల స్థితిగతులను, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అందుబాటులో ఉన్న జలాలను అంచనా వేసి రాష్ట్రమంతటికీ ఒక సమగ్రమైన నీటి పథకాన్ని కూడా ప్రతిపాదించారు. 1984లో తెలుగు గంగ ప్రాజెక్టు ఆరంభమయిన సమయంలో 'ఆంధ్రప్రదేశంలో సమగ్ర నీటి పథకం' విడుదలయింది. ఆ తర్వాత పలు ముద్రణలు పొందింది. ఇరవైఏళ్ళనాటి అప్పటి వివరాలకు, ఇప్పటి వివరాలకు కొంత తేడా ఉండవచ్చు. కానీ ఆ అధ్యాయనంలో అనుసరించిన శాస్త్రీయ పద్ధతి, సమగ్ర దృష్టి, తీసుకున్న ప్రాతిపదికల ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలో వివరిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ కమిటీ 2002 డిసెంబరు 17న చేసిన తీర్మానాన్ని ఈ పుస్తకానికి ముందు మాటగా మారుస్తున్నాం.