విప్లవపథంలో నా పయనం

image: 
Author: 
పుచ్చలపల్లి సుందరయ్య
Body: 

     "విప్లవపథంలో నా పయనం" అన్న సుందరయ్యగారికి ఆత్మకథ రెండవ భాగాన్ని మీకు ఇందులో అందిస్తున్నాం. మే 1వ తేదీకి ఆ మహనీయుడి 76వ జన్మదినోత్సవం జరుగుతుంది. మే 19వ తేదీకి ఆయన మూడవ వర్థంతి వస్తోంది. ఆ సందర్భానికి గ్రంథస్తం ఆయన ఈ అమూల్య ప్రచురణతోపాటు "సుందరయ్య విజ్ఞాన కేంద్ర" నిర్మాణాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సమర్పించుకోవాలని దాని ట్రస్టు కమిటీ ఆశించింది. కాని దాని తుది మెరుగులు దిద్దడంలో కొద్ది మాసాలు ఆలస్యం అయ్యేట్లున్నది.
    ఈలోగా ఒక విచారకర పరిణామం కలిగింది. ఆయన జీవిత భాగస్వామిని, తోటి కామ్రేడూ శ్రీమతి లీలా సుందరయ్య మార్చి 21వ తేదీన అస్తమించారు. ఆ ఆత్మకథ రెండవ భాగం ప్రచురణకు, విజ్ఞాన కేంద్ర ప్రారంభోత్సవానికి అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఆమె అసువులు బాశారు. ఆమె ఆత్మకథనూ, జీవితగాథనూ కూడా తర్వాత అచ్చువేసి అందించగలమని ఆశిస్తున్నాం.
    ప్రథమ వర్ధంతి సందర్భంగా మేము సమర్పించిన ఈ ఆత్మకథ తొలి భాగంలో సుందరయ్య బాల్యం నుండి స్వాతంత్ర్యం వచ్చేవరకు చెప్పబడి ఉన్నది. ఇప్పుడీ రెండవ భాగం తెలంగాణా పోరాటంతో ప్రారంభమై 1976 వరకు చెప్పబడినది. మొదటి భాగం వలెనే ఈ రెండవ భాగాన్ని కూడా అందించడానికి డాక్టర్ ఎ.పి. విఠల్ చేసిన కృషి ప్రశంసనీయం.
    విప్లవకారులైన కమ్యూనిస్టులకు కామ్రేడ్ సుందరయ్య అనేక విధాల ఆదర్శమూర్తి. ఆయన త్యాగం, దీక్ష అమోఘమైనవి. ప్రజాసేవకులకు, భావిపౌరులకు ఆయన జీవితమే ఒక మహోన్నత సందేశం. అందులో రెండవ భాగాన్ని మరో కానుకగా సమర్పిస్తున్నాం.