నేడు గ్రామీణ సంబంధాల గురించిన అధ్యాయనాలు జరగాల్సినంతగా జరగడం లేదు. నిజానికి ఆ రంగాన్ని ప్రధాన స్రవంతి ఎకడమిక్ పరిశోధకులు విస్మరిస్తున్నారు. దేశంలో 70 శాతం మంది జీవిస్తున్న గ్రామీణ ప్రాంతాల విశ్లేషణల ప్రాధాన్యతను వారు గుర్తించడంలేదు. గ్రామీణ ప్రాంతాలలో అత్యధికుల పరిస్థితి దుర్భరంగా ఉందన్నది వాస్తవం. వారి స్థితిగతులు మెరుగవడానికి, వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి వ్యవసాయ సంబంధాలలో సమూలమైన మార్పులు అవసరం. వీటి ప్రాతిపదికను సశాస్త్రీయంగా అర్థం చేసుకోవలసిఉంది. దానికి దోహదపడే లోతైన, విస్తృతమైన పరిశోధనలు రాయవలసి ఉంది. ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల గ్రామీణ సంబంధాల అధ్యాయాలను నిర్వహించినా, వ్యవసాయరంగాన్ని సంస్కరించాలనే పేరుతో కార్పోరేట్ తరహా వ్యవసాయాన్ని అవి సిఫార్సు చేస్తున్నాయి. మెజారిటీ గ్రామీణ, దేశ ప్రజల ప్రయోజనాలను ఇలాంటి అధ్యయనాలు పట్టించుకోవడం లేదు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలలో పనిచేసే కార్యకర్తలు రోజువారీ ఉద్యమాల్లో పాల్గొంటుంటారు. వారికి క్షేత్రస్థాయి పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నప్పటికీ వ్యవసాయ సంబంధాల గురించి ఒక క్రమబద్ధమైన అధ్యయనం చేయకలిగిన వ్యవధి, వృత్తిపరమైన పరిశోధనా నైపుణ్యం ఉండదు. ఇలాంటి నేపథ్యంలో అంతటి బృహత్తరమైన కర్తవ్యాన్ని సామాజిక భాధ్యత కలిగిన సంస్థలు, వ్యక్తులుగా ఉన్న ఎకడమిక్ మేధావులు చేపట్టక తప్పడం లేదు. అలాంటి కృషిలో భాగమే ఇప్పుడు మన ముందున్న 'గ్రామీణ ఆంధ్రప్రదేశ సర్వే'. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జనవిజ్ఞానవేదికలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం ఎంతైనా ప్రశంసనీయం. ఇంతటి విస్తృతమైన రాష్ట్ర వ్యాపిత సర్వే బహుశా ఇదే మొదటిది. 1974లో పుచ్చలపల్లి సుందరయ్య గుంటూరు జిల్లాలో అనంతవరం, కాజ అనే రెండు గ్రామాలను తీసుకుని గ్రామీణ సంబంధాల అధ్యయనం చేశారు. ఆ తర్వాత ఆలిండియా కిసాన్ సభ, ఫౌండేషన్ ఫర ఆగ్రేరియన్ స్టడీస్ అనే సంస్థలు సమిష్టిగా దేశవ్యాపితంగా గ్రామీణ సంబంధాల అధ్యయనానికి ఏడు సంవత్సరాల భారీ ప్రాజెక్టును చేపట్టాయి. దానిలో భాగంగా ఆ సంస్థలు 2005-2006లో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలకు చెందిన మూడు గ్రామాలను, అనంతవరం(గుంటూరుజిల్లా), బుక్కచెర్ల (అనంతపురంజిల్లా), కొత్తపల్లి (కరీంనగర్ జిల్లా) సర్వే చేసి, గత ఏడాది పుస్తక రూపంలో కూడా ప్రచురించాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జనవిజ్ఞానవేదికల ప్రస్తుత అధ్యాయనం రాష్ట్రంలోని 22 గ్రామీణ జిల్లాలలో 88 గ్రామాల సర్వే ఆధారంగా జరిగిందంటే దాని విస్తృతిని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ అధ్యయనం వెలువరించిన నిర్ధారణలు కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక ఆర్థిక తరగతులన వర్తమాన స్థితిగతులను ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. గ్రామీణ పరిస్థితిని ఇంకా లోతు అధ్యయనం చేయదల్చిన పరిశోధనలకు, రైతు - వ్యవసాయ కార్మికరంగాలలో పనిచేసే కార్యకర్తలకు, సమాజిక ఉద్యమాలలో పాల్గొనే కార్యకర్తలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తంగా దేశంలో వర్గసంబంధాల స్థితిగతుల అధ్యయనానికి దోహదపడుతుంది. ఈ రంగంలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకుపోవడానికి చక్కటి ప్రాతపదికగా ఇది ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రయోజనకరమైన కృషిని విజయవంతంగా నిర్వహించిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జనవిజ్ఞానవేదికల బృందానికి, వారికి సహకరించిన వారికి, ఈ కృషిలో పాలుపంచుకున్న ప్రతీఒక్కరికి నా అభివందనాలు.